133 పరుగులకే పరిమితమైన భారత్‌..

మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జంక్షన్‌ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో తలపడుతున్న టీమిండియా మహిళల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌.. 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లలో ఓపెనర్‌ షెఫాలీ వర్మ(34 బంతుల్లో 46: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. జ్వరం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్‌.. స్మృతి మందాన ఈ మ్యాచ్‌లో 11 పరుగులు మాత్రమే సాధించింది. తాహుహు బౌలింగ్‌ స్మృతి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన తానియా భాటియా(23) షెఫాలీకి చక్కటి సహకారాన్ని అందించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు అర్ధసెంచరీ(51) భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోజ్‌మేరి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన తానియా.. అమెలియా కెర్‌క్రు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరారు.


అనంతరం, క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌వుమెన్‌ షెఫాలీకి సహకరింకచలేరు. కివీస్‌ బౌలర్లను ఎదుర్కోలేక వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. షెఫాలీ క్రీజులో ఉన్నంత వరకు టీమిండియా భారీ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ, 14వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన షెఫాలీ.. హైలీ జెన్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. చివర్లో శిఖా పాండే(10 నాటౌట్‌), రాధా యాదవ్‌ 14 పరుగులు చేసి, భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ, ఎమీలియా కెర్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లీ తహుహు, కెప్టెన్‌ సోఫీ డివైన్‌, కాస్పెరిక్‌ తలో వికెట్‌ తీశారు.