ప్రతి జిల్లాలో పుడ్‌పార్కులు

అమరావతి : వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతుల ఆదాయాన్ని పెంచేవిధంగా ప్రణాళికలు రచించామని, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, పరిశ్రమ శాఖలు కలిసి పనిచేసే చేయాలని నిర్ణయించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెంచబోతున్నామని తెలిపారు. వ్యవసాయ, పరిశ్రమల శాఖలతో కలిసి జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రైతుల సమస్కల పరిష్కారానికి, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమ కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 



రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నాయుడు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేయాలంటూ విద్యార్థులను చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇదే చంద్రబాబు .. ప్రత్యేక హోదా కోసం రోడ్డుమీదకు వచ్చిన విద్యార్థులపై బెదిరింపులకు దిగారని గుర్తుచేశారు. రాజధానిపై ప్రభుత్వం ఏ నిర్ణయం చెప్పకముందే ఆందోళనలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరుగుతోందని, జీఎన్‌రావు, జీసీజీ నివేదికను హైపవర్‌ కమిటీ పరిశీలిస్తోందన్నారు. కమిటీ ప్రతిపాదనలో ఏవి అమలు చేయాలో త్వరలోనే నిర్ణయిస్తామని, అప్పుడే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.